ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియార్

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
మద్రాసు విశ్వవిద్యాలయపు సెనెట్ హౌస్‌లో ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు విగ్రహం

ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు (Arcot Lakshmanaswami Mudaliar) (1887 - 1974) ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసూతి వైద్య నిపుణులు మరియు విద్యావేత్త. ఆయన కవల సోదరుడు ఆర్కాటు రామస్వామి మొదలియారు కూడా విద్యారంగంలో, న్యాయరంగంలో తమ ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడంతో వీరిద్దరూ ఆర్కాటు సోదరులు పేరిట ప్రఖ్యాతులయ్యారు. లక్ష్మణ స్వామి మొదలియారు మద్రాసు విశ్వవిద్యాలయం లో అవిచ్చిన్నంగా 27 సంవత్సరాలు ఉప కులపతి గా పనిచేశారు.

లక్ష్మణస్వామి వ్యాఖ్యలు[మార్చు]

 • కొత్త పరిస్థితులు కొత్త దృక్పథానికి దారితీస్తాయి; కొత్త పురోగమనానికి గల అవసరాన్ని కూడా సూచిస్తాయి.
 • భావ ప్రకటన చేసినంత మాత్రాన లాభంలేదు. ఊరికే విమర్శించీ లాభం లేదు. నిందోక్తుల వల్లనూ లాభంలేదు. లక్ష్యసాధనకు ఆచరణసాధ్యమైన విధానాలు అవలంబించాలి.
 • సహన శాంతాలు అపూర్వగుణాలుగా పర్యవసిస్తూ వివిధ దృక్పథాల నుంచి భావ స్వాతంత్ర్యానికి ప్రతిఘటన లభిస్తూవున్న యీ ప్రపంచంలో తాత్కాలిక ప్రయోజనాల ఆకర్షణకు అతీతంగా సత్యాన్ని ఆరాధించేవారి కందరికీ విశ్వవిద్యాలయాలు నిస్సందేహంగా ఆశ్రయం కావాలి.
 • స్వతంత్ర ఆలోచనా విధానాలకు ఆశ్రయం కల్పించడం, అవివేకులైన పెక్కుమందికి కాక, సవ్యంగా ఆలోచించే కొద్దిమందికి నీడ కల్పించడం తమ ధర్మాలుగా విశ్వవిద్యాలయాలు గుర్తించాలి. సత్యం కోసం సాగిన భీకర సమరాల స్మృతుల్ని అవి పదిలపరచాలి.
 • వైద్యశాస్త్ర పట్టభద్రులకు నా సలహా యేమిటంటే ‘సంసిద్ధులై ఉండండి’.
 • వైద్యవృత్తి అసూయగల భార్యవంటిది; విశ్వాసంలో ఏమాత్రం లోపం కనిపించినా సహించదు.
 • విజ్ఞానం ఒక్కటే చాలదు; జీవిత విజయానికి వివేకం అవసరం. తనకంతా తెలుసునని విజ్ఞానం గర్వంతో మసులుతుంది. కాని వివేకం నమ్రత కలిగి తనకేమీ తెలయదనుకుంటుంది. వివేకంతో సంచరించు. సత్యాన్ని నమ్రతతో సాధించడమనే గొప్ప పారమే నీకు విశ్వవిద్యాలయం నేర్పగల గొప్ప పారం.
 • కొన్ని పుస్తకాలను పాఠ్యగ్రంథాలుగా నిర్ణయించి వాటిని విద్యార్థుల మీద బలవంతంగా రుద్దడమనే దురదృష్టకరమైన విధానం ఇక్కడ బలపడడం వాంఛనీయంకాదు. ఎందుకంటే ఆ విధానంవల్ల యువకుల మనస్సుల్లో ఉన్నత భావాలు కలగడంలేదు.

లక్ష్మణస్వామిపై వ్యాఖ్యలు[మార్చు]

 • మదరాసు శాసన మండలిలో ఆయనకి (లక్ష్మణస్వామి మొదలియార్) అభిముఖంగా కూర్చున్న ఆ పది సంవత్సరాలలోను నేను ఆయన విద్వత్తుని, బహుముఖ ప్రతిభను మితవాదిత్వాన్ని, అచంచలమైన కార్యదీక్షను చూసి మురిసిపొయ్యేవాణ్ణి. ఆయనది శాస్త్రీయమైన ఆలోచనావిధానం; వివిధ సమస్యలను విజ్ఞానశాస్త్ర దృష్టితో పరిశీలించేవారు. విజ్ఞానశాస్త్రంలో గాని సాంకేతిక రంగంలో గాని డా|| ఎ. యల్. మొదలియారు విశిష్టసేవ లభించని శాఖ లేదు. గత మూడు పంచవర్ష ప్రణాళికల కాలంలో మదరాసులో స్థాపించబడిన విజ్ఞానశాస్త్ర సాంకేతిక సంస్థల ఉనికికి ఆయన నిరంతర కృషి, శక్తి సామర్థ్యాలు కారణమనవచ్చు.
-ఆర్. వెంకటరామన్, భారత మాజీ రాష్ట్రపతి.
 • అశుతోష్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయానికి ఎలాంటి వాడో, మదరాసు విశ్వవిద్యాలయానికి డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియారు అలాంటివాడు.
-యం. యస్. అణే.
 • లక్ష్మణస్వామి మొదలియారు కేవలం తన ప్రతిభవల్లనే ఉన్నతి గడించినవాడు. అంతేకాని యితరుల అభిమానం వల్లనో, అదృష్టం వల్లనో, ఈ రెంటినీ మించి శక్తిమంతమైన కుట్రలవల్లనో ఆయన పైకి రాలేదు. ఆయన సౌశీల్యం, చక్కని పద్ధతులు యువతకు ఆదర్శాలు.
-సి.ఆర్.రెడ్డి.

ఆర్కాటు సోదరుల గురించిన వ్యాఖ్యలు[మార్చు]

 • మనదేశం నిస్సంశయంగా గర్వించదగినవారు ఆర్కాటు సోదరులు.
-సర్వేపల్లి రాధాకృష్ణ
 • ఒక సోదరుడు (రామస్వామి మొదలియారు) ప్రసిద్ధ ఆర్థిక శాస్త్రవేత్త. ప్రపంచానికే ఆహారం సరఫరా చేసే బాధ్యత వహించాడు. ప్రాచీనులు ఏ శాస్త్రమైతే భగవద్దత్తమనీ పవిత్రమైనదనీ భావించారో ఆ శాస్త్రానికి అంకితమైన వాడు మరో సోదరుడు (లక్ష్మణస్వామి మొదలియారు).
-ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం.
 • వారిద్దరూ ప్రపంచ మహాపురుషులచే ప్రశంసితులు. తమిళ దిజ్మండలంలో ప్రతిభాసించే రెండు నక్షత్రాలు.
-టి.పి.మీనాక్షిసుందరం.
 • అఖిలభారత స్థాయిలో వారిలా విఖ్యాతులైన సోదరులెవరూ నాకు స్ఫురణకు రావడంలేదు. అది ఒక విశిష్టమైన రికార్డు. వారికి రామలక్ష్మణులని పేర్లు పెట్టడం సమంజసం.
-బి.గోపాలరెడ్డి.
 • సాధారణంగా కవల పిల్లలు వివిధ రంగాలలో తమ దేశానికే కాక యావత్ప్రపంచానికే విశిష్టమైన సేవచేసిన ఘట్టాలు చరిత్రలో చాలా తక్కువగా ఉండవచ్చు.
-డేవిడ్ ఏ.మోర్స్.

మూలాలు[మార్చు]

 • ఆర్కాటు సోదరులు:చల్లా రాధాకృష్ణమూర్తి:తెలుగు విశ్వవిద్యాలయం:1988