తిరుపతి వేంకట కవులు
దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ల వెంకట శాస్త్రి అనే జంటకవులు తిరుపతి వేంకటకవులుగా ప్రసిద్ధులయ్యారు. గొప్ప పండితులు అయిన వీరు అనేక తెలుగు, సంస్కృత రచనలు చేశారు. వీరి రచనలలో బాగా ప్రసిద్ధమైనవి -
- "పాండవోద్యోగ విజయాలు" అనే నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా మారు మ్రోగాయి. అందులో ముఖ్యంగా "పడక సీను", "రాయబారం" భాగాలలోని పద్యాలు జనప్రియమైనవి. చాలామంది చదువురాని వాళ్ళు కూడా "బావా ఎప్పుడు వచ్చితీవు", "చెల్లియొ చెల్లకొ", "జెండాపై కపిరాజు" అనే పద్యాలను పాడగలిగేవారు.
- వీరి అవధాన పూరణలు, చమత్కారాలు పండితలోకంలో ప్రసిద్ధములు
పడక సీను
[మార్చు]నిద్రనుండి లేచిన శ్రీకృష్ణుడు ముందు అర్జునుడిని "ఎక్కడ నుండి రాక యిటకు?..." అన్న పద్యంతో పలకరించాడు. తరువాత దుర్యోధనుడిని చూచి -ఎప్పుడు వచ్చావు బావా? నీ వాళ్ళంతా బాగున్నారా? అని అడిగాడు. "బావా! యెప్పుడు వచ్చితీవు?" అన్న పదాలు తెలుగు భాషలో (కొంచెం చమత్కారంగా) వాడడం సర్వసాధారణమయ్యింది.
- బావా! యెప్పుడు వచ్చితీవు? సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్
- నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే?
- మీ వంశోన్నతి గోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూ
- దేవుల్ సేమంబై నెసంగుదురె? నీ తేజంబు హెచ్చించుచున్
రాయబారం
[మార్చు]రాయబారం సీనులోని దాదాపు అన్ని పద్యాలూ జనప్రియమయ్యాయి. ఈ పద్యాలను విడగొడితే దాదాపు సమాన్యమైన సంభాషణలలాగానే ఉంటాయి. - ఈ పద్యంలో - ఏదో కారణం వలన గాని మీరు పెట్టిన ఇబ్బందులను (పాండవులు) భరించారు. అయ్యిందేదో అయ్యింది. ఇవ్వాళ సర్దుకురమ్మని నన్ను పంపారు. నీ బిడ్డలు చల్గా ఉండాలని చక్కగా సంధి చేసుకుంటావో, లేకపోతే యుద్ధానికి కారణమౌతావో నీవే తేల్చుకొని చెప్పు (ధృతరాష్ట్ర మహారాజా!)
- చెల్లియొ చెల్లకొ తమకు జేసినయెగ్గులు సైచిరందరున్
- తొల్లి గతించె, నేడు నను దూతగ బంపిరి సంధి సేయ, నీ
- పిల్లలు పాపలుం ప్రజలు పెంపు వహింపగ బొందు సేసెదో
- యెల్లి రణంబు గూర్చెదవొ? యేర్పడ జెప్పుము కౌరవేశ్వరా!
ఇక యుద్ధమే జరిగితే - నేను రధం తోలుతుండగా అర్జునుడు గాండీవంతో బాణాలు కురిపించి "మూకను" చెండాడుతుంటే, అప్పుడు భరింపలేక సంధి చేసుకోవాలనుకొన్నా గాని, నీ మాట వినేవారుండరు.
- జెండాపై కపిరాజు, ముందు సితవాజి శ్రేణియుం గూర్చి నే
- దండంబుంగొని తోలు స్యందనముమీద న్నారి సారించుచుం
- గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండుచున్నప్పు డొ
- క్కండున్ నీమొఱ నాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్
అవధానాలు, చమత్కారాలు
[మార్చు]కవులకు మీసాలెందుకని ఎవరో అధిక్షేపించినపుడు, సంస్కృతంలోనూ, తెలుగులోనూ తమను మించిన కవులు లేరని సవాలు చేస్తూ, వీరు చెప్పిన పద్యం. దమ్మున్న కవులు ఎవరైనా మమ్ములను గెలిస్తే మీసాలు తీసి మొక్కుతామని:
- దోసమటంచు ఎరింగియు దుందుడు కొప్పగ పెంచినారమీ
- మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా
- రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ
- మీసము తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే.
ఇతరాలు
[మార్చు]అమ్మా! సరస్వతీ! నీ దయవలన మేము ఎన్నో సన్మానాలు అందుకొన్నాము అని చెప్పిన పద్యం. వారు ఎదురులేకుండా తమ కవితా దిగ్విజయం కొనసాగించారని ఈ పద్యం వలన తెలుస్తుంది:
- ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము, స
- న్మానము లందినాము, బహుమానములన్ గ్రహియించినార, మె
- వ్వానిని లెక్క పెట్టక నవారణ దిగ్విజయంబొనర్చి ప్ర
- జ్ఞా నిధులంచు బేరు గొనినాము, నీ వలనన్ సరస్వతీ!
తిరుపతి వేంకట కవులకూ, రామకృష్ణ కవులకూ చాలాకాలం వారి ప్రతిభ గురించి వివాదం (వాగ్వాదం) నడచింది. ఆ సందర్భంలో ఆ "అర్భకులు" గురించి వీరు ఇలా అన్నారు.'ఈమాట'లో కె.వి.ఎస్.రామారావు వ్యాసం
- చుక్కలు రాలలేదు రవిసోముల పోకడ మారలేదు న
- ల్దిక్కులు కూలలేదు జలధిజ్వలనం బుబుకంగలేదు నే
- డక్కట రామకృష్ణకవు లర్భకు లేగతి సేయనేర్తు రా
- ధిక్కృతవైరి వేంకటసుధీ కవిమౌళికి శృంగభంగమున్
- కాకరపర్తి యొక్కటియ కాదు, జగమ్మఖిలంబు నేకమౌ
- గా కల రామకృష్ణులకు గల్గునె శ్రీపతి వేంకటేశ్వరా
- స్తోక శతావధాన కవి ధూర్వహ దివ్యతర ప్రతిష్టతో
- డీకొనుశక్తి? యయ్యది ఘటించిన మాకును మోదమే కదా!