పోతన
పోతన గారు ఒక గొప్ప కవి వారు ఒక తెలుగు కవి (1450) లో తెలుగు రాష్ట్రములో జన్మించారు 1510 లో చని పోయారు...
ప్రార్ధనలు
[మార్చు]భాగవతం ఆరంభంలో వ్రాసిన ప్రార్ధనా పద్యం ఇది. పోతన అంత్యప్రాసల అందం ఈ పద్యంలో స్పష్టంగా కనుపిస్తుంది.
- శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
- క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో
- ద్రేకస్తంభకు కేళి లోల విలసదృగ్జాల సంభూత నా
- నా కంజాత భవాండ కుంభకు మహా నందాంగనా డింభకున్ !!
పోతన ముగురమ్మలనూ స్తుతించిన పద్యాలు చాలా మందికి నిత్య ప్రార్ధనా గీతాలు.
సరస్వతీ ప్రార్ధన. ఇందులో తెల్లనివైన 16 వస్తువులను సరస్వతి రంగుతో పోల్చాడు.
- శారద నీరదేందు ఘన సార పటీర మరాళ మల్లికా
- హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
- దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ సుభా
- కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ !!
అలాగే లక్ష్మీదేవిని స్తుతించాడు
- హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రోవు, అర్ధంపు బెన్నిక్క, చం
- దురు తోబుట్టువు, భారతీ గిరిసుతల్‌తో నాడు పూబోడి, తా
- మరలందుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
- సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్
అమ్మల గన్నయమ్మ పార్వతికి మ్రొక్కాడు.
- అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
- ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో
- నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా
- యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్
- అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికా
- డంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీప్తికా
- చుంబిత దిగ్విభాగ శ్రుతిసూక్త వివిక్త నిజ ప్రభావ భా
- వాంబర వీధి విశ్రుత విహారి ననుం గృపఁచూడు భారతీ!
రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో రుక్ముణీదేవి ఈశ్వరిని ప్రార్ధించే పద్యం. సంశయాకులయైన పడతి అమ్మవారిని శరణు జొచ్చి ఎలా బ్రతిమాలుతున్నదో చూడవచ్చును.
- నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్
- మిమ్ము బురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటిపె
- ద్దమ్మ, దయాంబురాశివి గదమ్మ, హరిం బతి జేయుమమ్మ, నిన్
- నమ్మిన వారి కెన్నడును నాశము లేదు గదమ్మ, యీశ్వరీ!
పోతన వినయ స్వభావానికి అద్దం పట్టేది ఈ పద్యం.
- పలికెడిది భాగవతమట
- పలికించెడి వాడు రామ భద్రుండట నే
- పలికిన భవ హర మగునట
- పలికెద వేరొండు గాథ పలుకగ నేలా !!
భగవత్తత్వం
[మార్చు]గజేంద్రమోక్షంలో ఈ పద్యాలు సుపరిచితాలు. "దేవుడంటే ఎవరు?" అన్నప్రశ్నకు జవాబు చెప్పడఅనికీ, ఏ మతంవారైనా తమ దేవుడిని స్తుతించుకోవడానికి సముచితాలు.
- ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై
- యెవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
- బెవ్వడనాది మధ్య లయు డెవ్వడు సర్వము తానెయైనవా
- డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్
ఈ పద్యంలో భగవంతుని ఈ లక్షణాలు చెప్పాడు కవి.
- జగం పుట్టడానికి కారకుడు
- జగం ఆయనలో ఉంటుంది.
- జగం ఆయనలో ముగుస్తుంది.
- ఆయన పరమేశ్వరుడు (అందరికీ ప్రభువు)
- అంతకూ మూల కారణం.
- మొదలు. మధ్య, తుది లేనివఅడు.
- అంతా తానే
- ఆత్మ భవుడు (తనంత తానే జన్మించాడు)
- లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యెఁ బ్రాణంబులున్
- ఠావుల్ దప్పెను మూర్చ వచ్చెఁ దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
- నీవే తప్ప నితఃపరం బెఱుఁగ మన్నింపందగున్ దీనునిన్
- రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా
మన శక్తి చాలనప్పుడు, వేరు మార్గం లేనప్పుడు దేవుడే దిక్కవుతాడు. ఇక నా వల్ల కాదు. పోరాడి అలసిపోయాను. ప్రాణాలు కడగడుతున్నాయి. నీవు తప్ప వేరు దిక్కు లేదు. పరమేశ్వరా రక్షించు. ఈశ్వరా కాపాడు. అని గజరాజు వాపోయాడు. -- "లావొక్కింతయు లేదు" అన్న పదాలు బాగా వాడుకలోకి వచ్చాయి. "లా" (Law) ఒక్కింతయు లేదు - అని సమకాలీన సమాజంపై చెణుకులు కూడా విసిరారు.
- అల వైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా
- పల మందార వనాంతరామృతసరః ప్రాంతేందుకాంతోపలో
- త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
- విహ్వల నాగేంద్రము 'పాహి పాహి' యనఁగుయ్యాలించి సంరంభియై
వైకుంఠలో గొప్ప మేడలో మందార వన ప్రాంతంలో అమృత సరసు ప్రక్క చంద్రకాంత మణులతో చెక్కి కలువపూలు పరచిన పాన్పుపై శ్రీలక్ష్మీదేవితో వినోదిస్తున్న శ్రీహరి గజేంద్రుని శరణుఘోష విని సంరంభంతో బయలుదేరాడు. - ఈ పద్యం గురించి ఒక కధ ప్రచారంలో ఉంది. పోతన ఒక పాదం వ్రాసి, కలం సాగక, వ్రాత కట్టిపెట్టి పొలానికి వెళ్ళాడట. తిరిగి వచ్చి చూస్తే పద్యం పూర్తి అయిఉంది. ఇదేమిటని కూతురినడిగితే మీరే వచ్చి వ్రాశారు గదా నాన్నా అన్నదట. శ్రీరామచంద్రుడే తనపట్ల కరుణించి ఆ పద్యాన్ని పూర్తి చేసి ఉంటాడని పోతన భావించాడు.
- సిరికిం జెప్పఁడు శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపఁడే
- పరివారంబును జీరఁడభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
- తర ధమ్మిల్లముఁజక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
- పరిచేలాంచలమైన వీడఁడు గజ ప్రాణావనోత్సాహియై.
గజేంద్రుని కాచే తొందరపాటులో బయలుదేరిన శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖ చక్రములను ధరింపలేదు. పరివారాన్ని, వాహనాన్ని పిలువలేదు. మొగంపై విరిసిన ముంగురులు చక్కనొత్తలేదు. వాదంలో పట్టుకొన్న లక్ష్మీదేవి పైటను కూడా వదలలేదు -- ఈ పద్యాన్ని గురించి కూడా ఒక కధ ప్రచారంలో ఉంది. ఆయుధాలూ, వాహనం కూడా లేకుండా బయలుదేరి గజేంద్రుని ఎలా రక్షిస్తాడు బావగారూ! అని శ్రీనాధుడు ఆక్షేపించాడట. అందుకు సమాధానం చెప్పడానికి పోతన కొడుకు నూతిలో ఒక రాయి వేసి, అమ్మో మామయ్య కొడుకు నూతిలో పడ్డాడని అరిచాడు. వెంటనే శ్రీనాధుడు పరుగెత్తిపోయి నూతి చుట్టూ చక్కర్లు కొట్టడం మొదలు పెట్టాడు. త్రాడు, నిచ్చెన లాంటివి ఏమీ లేకుండా నీ కొడుకును ఎలా కాపాడుకొందామనుకొన్నావు మామయ్యా అని శ్రీనాధుని పోతన కొడుకు ఎత్తిపొడిచాడు. అట.
చదువు
[మార్చు]చదువుకోమని హిరణ్య కశిపుడు ప్రహ్లాదునకు చెప్పిన విధం. "తండ్రీ" అని ఒక తండ్రి తన కొడుకును ఎంత చక్కగా బుజ్జగిస్తున్నాడో చూడవచ్చు.
- చదువని వాడజ్ఞుండగు
- చదివిన సదసద్వివేక చతురత గలుగున్ !
- చదువగ వలయును జనులకు
- చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ !
వర్ణనలు
[మార్చు]వామనావతారం ఘట్టంలో వామనుడు త్రివిక్రముడై పెరిగిన విధాన్ని వర్ణించే ఈ రెండు పద్యాలూ చాలా ప్రసిద్ధి చెందినవి. "ఇంతింతై వటుడింతయై " అన్న పదాలను ఒక నుడికారంగా పలు సందర్భాలలో వాడుతారు. వామనుడు పెరిగిన కొద్దీ సూర్య బింబం స్థాయి ఎలా ఉందో రెండో పద్యంలో వివరంచాడు. ముందు గొడుగుగా ఉంది. తరువాత తలపైరత్నం. తరువాత మెడలో ఆభరణం. ఇలా చివరకు పాదపీఠం అయ్యంది.
- ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధి పై
- నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభా రాశి పై
- నంతై చంద్రుని కంతయై ధ్రువుని పై నంతై మహర్వాటి పై
- నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి యై !!
- రవి బింబంబుపమింప పాత్రమగు ఛత్రంబై శిరో రత్నమై
- శ్రవణాలంకృతి యై గళా భరణామై సౌవర్ణ కేయూర మై
- ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచత్ ఘంటయై నూపుర
- ప్రవరంబై పదపీఠ మై వటుడు తా బ్రహ్మాండమున్ నిండుచోన్ !!
సూర్యోదయ వర్ణనం
- పౌలోమి దన బాలు పాన్పుపై గనువట్ట
- బన్నిన పవడంపుబంతి యనగ
- నాయురర్థముల వ్యయంబు లొత్తిలి చాటు
- కాలజాంఘికుచేతి ఘంట యనగ
- ఘనజంతుజీవితకాలరాసుల విధి
- కొలువ నెత్తిన హేమకుంభ మనగ
- బశ్చిమదిక్కంత పరగ గైసేయుచో
- ముందట నిడుకొన్న ముకుర మనగ
- గోకతాపోపశమదివ్యఘటిక యనగ
- బద్మినీకాంతనోములఫల మనంగ
- మూడుమూర్తుల సారంపు ముద్ద యనగ
- మిహిరమండల ముదయాద్రిమీద నొప్పె.
సూర్యబింబం తూర్పుకొండపై ఉదయించింది. అది శచీదేవి తన పిల్లవాని పానుపుమీద కనిపించేట్టు చిలుకల పందిరికి అమర్చిన పగడాలబంతియా అన్నట్లుంది. ఆయుస్సనే ధనం వ్యయమై పోతున్నది అని గట్టిగా చాటుతున్న కాలమనే వార్తాహరునిచేతిలోని గంటయా అన్నట్లుంది. బ్రహ్మదేవుడు ప్రాణుల జీవితకాలమనే ధాన్యరాసులను కొలవడానికి ఎత్తిన బంగరుకుంచమా అన్నట్లుంది. పడమటిదిక్కు అనే అంగన అలంకరించుకునేటప్పుడు ముందుంచుకున్న అద్దమా అన్నట్లుంది. జక్కవల పరితాపం మాన్పే దివ్యమైన మందుగుళికయా అన్నట్లుంది, పద్మిని అనే నాయిక వ్రతఫలమా అన్నట్లుంది. ముమ్మూర్తుల వెలుగుముద్దయా అన్నట్లుంది.
సంభాషణా చాతుర్యం
[మార్చు]గోప కాంతలు యశోదతో మొరపెట్టుకొన్న విధం. నీ కొడుకు ఆగడాలతో వేగలేకపోతున్నామమ్మా అని.
- ఓ యమ్మ: నీ కుమారుడు
- మాయిండ్లను బాలుబెరుగు మననీడమ్మా:
- పోయెద మెక్కడి కైనను
- మాయన్నల సురభులాన మంజులవాణీ!
కిట్టయ్యను యశోద ఇలా నిలదీసింది. మన్నెందుకు తిన్నావురా కన్నా అని.
- మన్నేటికి భక్షించెదు?
- మన్నియమము లేల నీవు మన్నింపవు? మీ
- యన్నయు సఖులును జెప్పెద
- రన్నా! మ న్నేల మఱి పదార్ధము లేదే?
ఎబ్బే నేనెందుకు మన్ను తింటాను? వాళ్ళూరికే చాడీలు చెబుతున్నారు. అన్నాడు బాలకృష్ణుడు
- అమ్మా! మన్ను దినంగనేశిశువనో? యాకొంటినో? వెఱ్ఱినో?
- నమ్మం జూడకు వీరి మాటలు మదిన్; నన్నీవు గొట్టంగ వీ
- రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాగం
- ధమ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే.
వనరులు
[మార్చు]కొన్ని పద్యాలు, భావాలు వివిధ వెబ్ సైటులనుండి కాపీ చేయబడ్డాయి