Jump to content

స్నేహం

వికీవ్యాఖ్య నుండి
  • స్నేహానికన్న మిన్న లోకన లేదురా, కడదాక నీడలాగ నిను వీడి పోదురా
- భువనచంద్ర ( ప్రాణ స్నేహితులు చిత్రంలో పాట )
  • స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం*.!
*స్నేహం* ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహ భావం ఉంటుంది. అటువంటి స్నేహాని అనుభవిస్తేనే తెలుస్తుంది. సృష్టిలో నా అనేవారు, బంధువులు లేని వారైన ఉంటారేమో గాని స్నేహితులు లేని వారుండరు. ఇంట్లో చెప్పలేని సమస్యలు, బాధలు సైతం వీరితో ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పు పొందుతాం. అదే స్నేహం. *స్నేహం* ప్రకృతి వంటిది. అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయినిస్తుంది'. 'జీవనయానంలో స్నేహం శ్వాస వంటిది'. స్నేహం ఎంతో తియ్యనైంది. అమ్మ ప్రేమ, స్నేహం ఈ రెండే జీవితంలో ముఖ్యం. స్నేహితులతో కలిసి ఉంటే కలిగే ఆనందం చెప్పలేనిది. ప్రవిత్రమైన స్నేహం ఉండాలి. అటువంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది. *స్నేహం ఓ మధురం..! స్నేహం ఓ వరం*..!! స్నేహానికి ఉన్న గొప్పదనం ఎన్ని రకాలుగా చెప్పినా వర్ణించేందుకు వీలుకానిదే...! అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం. స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న మొదలైన బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా స్నేహితులను మాత్రం మననే ఎంచుకోమన్నాడు. అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. *స్నేహితుడి కోపాన్ని..లోపాన్ని భరించడమే నిజమైన స్నేహం*..! ఎదుటి వాడిలోని కోపాన్ని, లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు అంటారు. స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు. మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనప్పుడు నిస్సంకోచంగా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి వెన్నలా చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం. తమకు అవసరమైనప్పుడు కనీసం మాట సాయం చేయడానికైనా ఆప్తమిత్రులు ఉన్నారనే భావం మన కష్టాల తీవ్రతను తగ్గిస్తుంది. వారితో చర్చించి సమస్యకు పరిష్కారం కనుక్కొనాలనే ఆలోచనను కూడా కలిగిస్తుంది. *కంటికి దూరమైనా మనసుకు దగ్గరగా ఉండేదే స్నేహం*...! ప్రతీ రోజు మాట్లాడుకోకున్నా అవసరమైనప్పుడు మనకు ధైర్యం, ఓదార్పు చెప్పే నేస్తం ఉన్నాడనే నమ్మకం మనకు కొండంత ధైర్యాన్ని, మనసుకు ఉపశమనాన్ని ఇస్తుంది. అందుకే నిజమైన స్నేహితుడు కంటికి దూరమైనా మనసుకు దగ్గరగా ఉంటాడు అంటారు. ఒక్కోసారి కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను ఆత్మీయ స్నేహితులతో నిర్మొహమాటంగా చర్చించుకోవడం స్నేహితుల మధ్య జరిగే అతి సాధారణ ప్రక్రియ.
  • స్నేహం అనేది మాటల్లో కాదు, మనసుల లోతుల్లో ఉంటుంది.
  • స్నేహితులు మన జీవితంలోని నిజమైన సంపద.
  • స్నేహం అంటే ఒకరికొకరు పరస్పర అర్థం చేసుకోవడం, సహాయం చేయడం, మద్దతు ఇవ్వడం. నిజమైన స్నేహం ఎప్పటికీ మారదు, సుముఖ పరిస్థితుల్లోనే కాదు, కష్టాల్లో కూడా నిలబడుతుంది.

స్నేహసంపద స్నేహానికి ఎల్లలు లేవు, పరిమితులు లేవు. అది ఒక మహా ప్రవాహం. లోతుకు వెళుతున్న కొద్దీ అనిర్వచనీయమైన అనుభూతిని, చిరస్మరణీయమైన మధుర జ్ఞాపకాలను స్నేహితులు పొందుతారు. స్నేహం త్యాగాన్ని కోరుతుంది, ప్రేమను కురిపిస్తుంది, హర్షాన్ని వర్షింపజేస్తుంది, సంతృప్తిని కలిగిస్తుంది, అసంతృప్తిని తొలగిస్తుంది, స్వార్థాన్ని సమూలంగా నశింపజేస్తుంది. కపటాన్ని, కాఠిన్యాన్ని దరి చేరనీయదు. హద్దులను చెరిపివేస్తుంది. సద్బుద్ధిని ప్రవేశపెడుతుంది. ఆశలను చిగురింపజేస్తుంది. ఆశయాలను తలపింపజేస్తుంది. అభివృద్ధిని చేకూర్చుతుంది. సన్మార్గంలో పయనింపజేస్తుంది. అందుకే స్నేహమే జీవితం, స్నేహమే శాశ్వతం, స్నేహానికన్న మిన్న లోకాన లేదు అనే మాటలు పాటలుగా ప్రసిద్ధికెక్కాయి.మంచి మిత్రులు ఎట్లా ఉంటారో భర్తృహరి స్వీయ నీతిశతకంలో నిర్వచించారు. పాపాన్నివారయతి యోజయతే హితాయ గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీ కరోతి ఆపద్గతంచ నజహాతి దదాతి కాలే సన్మిత్రలక్షణమిదం ప్రవదన్తి సన్తః ॥ పాపకార్యాల నుంచి నివారింపజేస్తూ హితాన్ని కలిగించే సత్కార్యాలలో ప్రవర్తింపజేస్తూ, రహస్యాలను రహస్యంగా ఉంచుతూ, సద్గుణాలను అందరికీ తెలియజేస్తూ, ఆపదల్లో చిక్కుకున్నప్పుడు వదిలిపెట్టకుండా, అవసరాలకు తగినట్లుగా సహాయం చేసే వ్యక్తులే సన్మిత్రులుగా పేర్కొనదగినవారని భర్తృహరి సన్మిత్రుల లక్షణాలను ప్రకటించారు. స్నేహంలో ఎక్కువ తక్కువలుండవు. అంతరంగ స్నేహితుడుగా రూపుదిద్దుకున్న వ్యక్తి ధనికుడా? పేదవాడా? కష్టాల్లో ఉన్నాడా? లేక సుఖ పడుతున్నాడా? అనే ఆలోచన కలుగదు. భోగభాగ్యాలతో సుఖసంపదలతో, అన్నివిధాల ఉన్నతుడైన వ్యక్తితో మాత్రమే స్నేహం చేయాలి అనే స్వార్థభావన కూడా ఏర్పడదు. పైగా యథార్థ స్నేహితులు ఒకరి శ్రేయస్సుకై మరొకరు తమ సుఖాలను, ధనాన్ని, సమయాన్ని, చివరకు తమ దేహాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడుతారు. సుఖదుఃఖాలను కూడా సమంగా పంచుకుంటారు అని వాల్మీకిమహర్షి కిష్కింధకాండలో తెలిపారు. ఇట్టి స్నేహసంపదను కలిగియుండుటకై ప్రయత్నిద్దాం. -సముద్రాల శఠగోపాచార్యులు

"https://te.wikiquote.org/w/index.php?title=స్నేహం&oldid=25943" నుండి వెలికితీశారు