సోమరాజు సుశీల

వికీవ్యాఖ్య నుండి

సోమరాజు సుశీల (1945, ఏప్రిల్ 28 - 2019, సెప్టెంబర్ 26) ప్రసిద్ధ తెలుగు రచయిత్రి. రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ చేసింది. ఆమె రసాయన శాస్త్రంలో లెక్చరర్‌గాను, తరువాత సైంటిస్ట్ గా పనిచేసింది. 1974లో హైదరాబాద్ లో పారిశ్రామిక వేత్తగా మారి భాగ్యనగర్‌ లేబొరేటరీస్‌ సంస్థను నడిపించింది. హాస్యరసస్ఫూర్తితో రచనలు చేసింది.

వ్యాఖ్యలు[మార్చు]

శైలజ,చందు తదితరులు. అష్టదిగ్గజాలంటే ఆరు. హైదరాబాద్, హాస్యప్రియ పబ్లికేషన్స్,2019.

  • పెద్దతనం, ముసలి తనం, వృద్ధాప్యం అని అందరూ హడలగొట్టి చంపేసే ఆ దశ వచ్చేసిందా? అప్పుడే వచ్చేసిందా?
  • పెద్దయితే అయ్యాంగానీ ఎంత హాయిగా ఉంటోందో! మండే ఎండల తర్వాత వాన చినుకు పడ్డట్టు… ముసుళ్ల వానల ముజ్జిడ్డులు దాటి, వెన్నెల మోసుకొచ్చే చందమామ కనపడ్డట్టు…గజ గజ లాడే చలి వణుకులు వణికాక వెచ్చటి కమ్మటి మట్టిగాలి పలకరించినట్టు…ఎంత హాయిగా వుందో!
  • ఇంకొక పెద్ద విశేషం ఉందండోయ్, ఎవరికీ తెలియనిదీ మనం పైకి చెప్పనిదీ ..మనం ఎవరికీ అక్కర్లేదు కాబట్టి మనకీ ఎవరూ అక్కర్లేదు! ఎవరూ మన మాట వినిపించుకోరు కాబట్టి మనమూ ఎవరి మాటా వినిపించుకోనక్కర్లేదు! అంతా నిశ్శబ్ద సంగీతం!
  • ఏరుని ఎప్పుడూ గలగలా ప్రవహించమంటే కుదుర్తుందా? సముద్రం దగ్గర పడుతుంటే హాయిగా నిండుగా హుందాగా అడుగులేస్తుంది కదా! అయినా ఎపుడేనా మనకి తిక్క పుట్టినపుడు అడ్డంగా, అర్ధం పర్ధం లేకుండా వాదించి ఇవతల పడచ్చు. ఇంత వయసు వచ్చాక ఆ మాత్రం చేయ తగమా!
  • ఈ మధ్యనే నేను కనిపెట్టాను ఇంకొక పెద్ద విశేషం…అస్తమానం ప్రవచనాలు వింటూ హైరానా పడక్కర్లేదు. మనకి చెప్పడం రాదు గానీ వాళ్ళు చెప్పేవన్నీ మనకూ తెలుసు!
  • అవునూ… మనం కనపడగానే మొహం ఇంత చేసుకుని ఆనంద పడిపోయే మన పిన్నిలూ, బాబాయిలూ, అత్తయ్యలూ, మామయ్యలూ ఏమయిపోయారు? ఎప్పుడెళ్లిపోయారు? పిచ్చిపిల్లా కొత్త మాగాయలో వేడన్నం కలుపుకుని, ఈ నూనె చుక్కేసుకుని రెండు ముద్దలు తిను’ అంటూ వెంటబడే వాళ్లెవరూ లేరే? అంటే మనమే పెద్దవాళ్లయిపోయామన్నమాట! చూస్తూండగానే సాటివాళ్లు కూడా కనిపించడం మానేస్తున్నారు. కొందరుండీ లేనట్టే. లేకా వున్నట్టే. జీవితానికి విశ్రాంతి దానంతటదే వస్తోంది.
  • అయినా రైలెక్కాక కిటికీ పక్కన కూచుని దారిలో వచ్చే పొలాలూ, కాలవలూ, కుర్రకారూ, పల్లెపడుచులూ, టేకు చెట్లూ, భవనాలూ, వాటి పక్కనే గుడిసెలూ, అక్కడాడుకుంటూ చేతులూపే చిన్నారులూ, ఉదయిస్తూ అస్తమిస్తూ అలుపెరగక డ్యూటీ చేసే సూర్యనారాయణమూర్తులూ, మిణుకు మిణుకుమని హొయలుపోయే చుక్కలూ చూస్తూ ప్రయాణం ఎంజాయ్ చెయ్యాలి గానీ స్టేషనెప్పుడొస్తుందో అని ఎదురుచూడడం ఎందుకూ? తీరా అదొస్తే ఏముందీ! జీవితమంతా పోగేసిన సామాన్లన్నీ వదిలేసి దిగిపోవడమేగా!
  • తనకోసం పడేది శ్రమ. మనకోసం పాడేది పరిశ్రమ. ధనం కోసం నడిపేది భారీ పరిశ్రమ.

రచయిత్రి గురించి[మార్చు]

  • తన గురించిన వ్యంగ్యం, వ్యంగ్యం, సున్నితమైన విమర్శ శైలి, తనమీద తాను మొదట నవ్వుకునే గొప్ప సామర్థ్యం కలిగిన ​​డాక్టర్ సుశీల ఇలా చెబుతారు, "మన జీవితంలో మనం సేకరించే జ్ఞానం చాలా ఉంది, నేను దానిని చిన్నవారితో పంచుకోవాలనుకుంటున్నాను కానీ నేను ఎల్లప్పుడూ బోధించినట్లు కాకుండా వారికి ఎలా తెలియజేయాలో ఆలోచిస్తుంటాను.[1]"
  • డాక్టర్ సోమరాజు సుశీల తెలుగే కాకుండా సైన్స్, సోషల్, ఆల్జీబ్రా, కెమిస్ట్రీ క్షుణ్ణంగా వచ్చిన కధకురాలు, ప్రపంచాన్ని విస్తారంగా గమనించినందున పలు అనుభవాలుంటాయి. వాటిని రాతల్లో పొదగడం బాగావచ్చు.[2]

సూచనలు[మార్చు]

w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
  1. Usha Turaga, Dr Suseela Somaraju: A multifaceted woman!28 Sept 2019. Hans India. https://www.thehansindia.com/featured/sunday-hans/a-multifaceted-woman-568070? infinitescroll=1
  2. శ్రీరమణ, ముందుమాట. అష్టదిగ్గజాలంటే ఆరు. హైదరాబాద్, హాస్యప్రియ పబ్లికేషన్స్,2019.పు.6.