జిడ్డు కృష్ణమూర్తి
Appearance
జిడ్డు కృష్ణమూర్తి ఆధునిక తత్వవేత్తల్లో ఆద్యుడిగా ప్రపంచమంతా ప్రశంసలు పొందిన జ్ఞాని. ఇతడు 1895 మే 11న జన్మించాడు. 1986 ఫిబ్రవరి 17న మరణించాడు. తత్వం, మనస్తత్వం, సామాజిక శాస్త్రం, ఆధ్యాత్మికతపై వీరు రచనలు, ప్రసంగాలు చేశారు.
Quotes
[మార్చు]1910s
[మార్చు]At the Feet of the Master (1911)
[మార్చు]- At the Feet of the Master (1911) — "Alcyone" అనే కలం పేరు తో వ్రాసినవి
- ఈ అర్హతలలో మొదటిది వివక్ష; సాధారణంగా ఇది సత్యాసత్యాల మధ్య ఉంటుంది. మనిషికి దారి చూపించెడిదిగా ఉంటుంది.
- యావత్ ప్రపంచంలో జనులు రెండే రకాలు: జ్ఙానులు, అజ్ఙానులు. ఈ జ్ఙానమే ప్రాముఖ్యత గలది.
- ఒక మనిషి దేవుని వైపు ఉన్నచో, మనలో ఒకడైనట్లే. ఆ మనిషి తనను తాను, హిందువు అని/బౌద్ధుడని/క్రైస్తవుడని/ముహమ్మదీయుడని సంబోధించుకొంటాడా లేదా భారతీయుడని/ఆంగ్లేయుడని/చైనీయుడని/రష్యన్ అని సంబోధించుకొంటాడా అన్నది కించిత్తు కూడా అనవసరం. అతని వైపు ఉన్న వారికి వారు ఇక్కడ ఎందుకు ఉన్నారో, ఏం చేయాలో తెలుసు; వారు అది చేయటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. మిగతా వారందరికి ఏం చేయాలో తెలియదు. అందుకే వారు మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందరూ ఒక్కటే అని తెలియక, ఒక్కరికి అనుకూలంగా ఉన్నదే అందరికీ అనుకూలంగా ఉండదని తెలియక, వారికి అనుకూలంగా ఉండే కొత్త దారులను అన్వేషిస్తూ ఉంటారు. సత్యాన్ని కాక అసత్యాన్ని అనుసరిస్తారు. సత్యాసత్యాల మధ్య భేదం తెలిసే వరకు వారు దేవుని వైపు కాదు. కావున ఈ భేదాన్ని గుర్తించగలగటమే మొట్టమొదటి అడుగు.
- అతను (భగవంతుడు) ప్రేమస్వరూపము కాబట్టి, నువ్వు అతనిలో ఐక్యం కావాలనుకొంటే, నీలో ఖచ్చితమైన నిస్వార్థ గుణము, ప్రేమ కూడా నిండుగా ఉండాలి.
- ప్రపంచానికి ఎక్కువ హాని చేసే మూడు పాపాలు - చెప్పుడు కబురు, క్రౌర్యం, మరియు మూఢనమ్మకం - ఎందుకంటే ఈ మూడు పాపాలు, ప్రేమకు విరుద్ధం. వీటికి వ్యతిరేకంగా ఏ మనిషి తన హృదయం నిండా దైవప్రేమను నింపుకొంటాడో, అతను నిరంతరం పరిశీలిస్తూనే ఉండాలి.
- చెప్పుడు కబురు ఏం చేస్తుందో చూడండి: ఒక కుటిల ఆలోచనతో మొదలవుతుంది, అసలు కుటిల ఆలోచనే ఒక నేరం. ప్రతి ఒక్కరిలోను, ప్రతి వస్తువులోను మంచి/చెడు రెండూ ఉన్నవి.
- వీరందరూ తమ క్రౌర్యాన్ని ఆచారంగా చెప్పుకొని సమర్థించుకొంటారు; కానీ చాలా మంది చేసినంత మాత్రాన నేరం నేరం కాకుండా పోదు. కర్మ ఆచారాన్ని ఏ మాత్రం పరిగణించదు. పైగా క్రౌర్యం యొక్క కర్మ అన్నింటికంటే ఘోరమైనది.
- మూఢనమ్మకం మరొక పెద్ద జాడ్యం, ఇది ఘోరమైన క్రౌర్యానికి దారి తీసినది. మూఢనమ్మకానికి బానిసయైనవాడు తన కంటే తెలివైనవారిని ద్వేషిస్తాడు. తాను చేసినట్లే ఇతరులు కూడా చేయాలని బలవంతపెట్టటానికి ప్రయత్నిస్తాడు.
- దేవుని పేరుతో, మూడనమ్మకమనే ఈ పీడకలకు ప్రభావితులై చాలామంది చాలా నేరాలు చేశారు. నీలో ఇసుమంతైననూ ఇది మిగిలిపోకుండా అత్యంత జాగ్రత్తగా ఉండు.
ఇతరాలు
[మార్చు]- భయపడుతూ ఉన్నవాడే నమ్మకాన్ని నిరంతరం నిలబెట్టుకోవటానికి ప్రయత్నిస్తాడు.
- మనస్సు, హృదయం నిశ్చలంగా వుంటే ఉత్సాహం లభిస్తుంది.
- అనుభవించడం జరగగానే అది అనుభూతి అవుతుంది. అంటే గతానికి సంబంధించినది అయిపోతుంది. అది జ్ఞానం క్రింద చలామణి అవుతుంది.
- అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో. మనిషిలో సమూలమైన పరివర్తన కలగపోతే ఈ యుద్దాలు, ఈ హింసాకాండ, ఈ విధ్వంసము ఇట్లాగే కొనసాగుతూ వుంటాయి.
- రాజకీయ, ఆర్ధిక విప్లవాలు కానీ, సామాజిక సంస్కరణలు కానీ ఈ పరివర్తనను తేలేవు. నూతన ఆదర్శాలు, మతాత్మకమైన ఆశయాలు అవలంబించినా, కొత్త సిద్ధాంతాలతో, కొత్త పద్ధతులలో మనిషిని నిర్భందించినా ఇది జరగదు. తనని తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది.
- ఒక చెట్టునుంచి రాలే ఆకు మృత్యువుకి భయపడుతుందా? ఒక పక్షి మృత్యువుకు భయపడుతూ జీవిస్తుందని అనుకుంటున్నావా? మృత్యువు ఎప్పుడు వస్తే అప్పుడు దానిని అది కలుసుకుంటుంది. అంతేగాని మృత్యువును గురించి ఆందోళన చెందదు. కీటకాలను పట్టుకు తింటూ, గూళ్ళు నిర్మించుకుంటూ, పాటలు పాడుకుంటూ, నిశ్చింతగా జీవించడానికి కుతూహలపడుతుంది. వాటంతట అవి విరామం లేకుండా ఆనందపడుతున్నట్లు కనిపిస్తాయి. వాటికి మృత్యువును గురించి చింతే ఉండదు. మృత్యువు ఆసన్నమైందా, రానీ వాటి పని అవి చేస్తాయి. ముందు ఏంజరుగుతుందో అనే ఆందోళన ఉండదు. క్షణం క్షణం సజీవంగా ఉంటాయి. మనకే, మనుష్యులకే మృత్యువు అంటే భయం. ఎప్పుడూ భయపడుతూంటాం. వృద్ధులు మృత్యువుకు చేరువగా ఉంటారు. యువకులు కూడా దీనికి ఎంతో దూరంలో ఉండరు. మృత్యుభావంతో మనం నిమగ్నులమై ఉంటాం. ఎందుకంటే మనకు బాగా తెలిసిన దాన్నిగాని, సంగ్రహించి పెట్టుకున్న దాన్నిగాని పోగొట్టుకోడానికి భయపడతాం. చేసుకున్న భార్యనుగానీ, భర్తనుగానీ, బిడ్డనుగానీ, స్నేహితునిగానీ పోగొట్టుకోడానికి భయపడతాం. మనం తెలుసుకున్న దానిని పోగొట్టుకోడానికి భయపడతాం. సంపాదించుకున్న దానిని పోగొట్టుకోడానికి భయపడతాం. మనం ప్రోగుచేసుకున్న వాటినన్నిటినీ - మన స్నేహితులను, మన ఆస్తులను, సంపత్తులను, మన గుణాలనూ, శీలాన్ని కూడా తీసుకువెళ్ళగలిగినప్పుడు మనం మృత్యువు అంటే భయపడం. అందుకే మృత్యువు గురించి, దాని తరువాత జీవితాన్ని గురించి, ఎన్నెన్నో సిద్ధాంతాలను సృష్టించుకుంటాం. కానీ అసలు విషయం మృత్యువు అంటే అది అంతం. దీనిని అనుభవించడానికి సమ్మతించం. తెలిసిన దానిని వదలదలచుకోము. కాబట్టి తెలిసినదానికి అంటిపెట్టుకుని ఉండడం వల్ల మనలో భయం కలుగుతూంది. అంతేగానీ తెలియని దానివల్ల కాదు. తెలియని దానిని తెలిసిన దానితో గ్రహించలేం. కానీ మన మనస్సు తెలిసినవాటితో ఉండి "నేను అంతం అయిపోతున్నాను" అన్నప్పుడు భయపడిపోతుంది.
[మార్చు]