నన్నయ
నన్నయ లేదా "నన్నయ భట్టారకుడు తెలుగు భాషలో ఆదికవి. మహాభారతం తెలుగు సేత మొదలుపెట్టాడు. నన్నయ 11వ శతాబ్దానికి చెందిన కవి. తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుడు నన్నయతో ఆంధ్రమహాభారతాన్ని రాయించాడు. భారత రచనలో నన్నయకు నారాయణ భట్టు సహకరించాడు. నన్నయకు ఆదికవి అనే కాకుండా వాగమ శాసనుడు అనే బిరుదు కూడా ఉంది.
నన్నయ యొక్క ముఖ్య వ్యాఖ్యలు
[మార్చు]- గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్...
తొలి తెలుగు కావ్యారంభం
[మార్చు]- శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే
- లోకానాం స్థితి మావహంత్య విహతాం స్త్రీపుంస యోగోద్భవాం
- తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
- ర్భూయాసుః పురుషోత్తమాంభుజభవ శ్రీకంధరా శ్శ్రేయసే
భావం: లక్ష్మీ దేవిని వక్షస్థలాన ధరించిన విష్ణువూ, సరస్వతిని ముఖమున ధరించిన బ్రహ్మ, పార్వతిని తన అర్ధ భాగంగా కలిగిన మహేశ్వరుడు - ఈ త్రిమూర్తులూ లోకాలను రక్షించేవారు. వేద స్వరూపులు. దేవతాపూజ్యులు. పురుషోత్తములు. అట్టి ముమ్మూర్తులు మీకు శ్రేయస్సు కలుగజేతురు గాక.
మహాభారతాంధ్రీకరణలో మొదటిగా నన్నయ చెప్పిన సంస్కృత శ్లోకం ఇది. తెలుగు సాహిత్యానికి శ్రీకారం.
సభా మర్యాద
[మార్చు]సభలో ఎలా మాట్లాడాలి? (యయాతి బోధన)
- మనమునకుఁ బ్రియంబును హిత
- మును బథ్యముఁ దథ్యమును నమోఘము మధురం
- బును బరిమితమును నగు పలు
- కొనరఁగ బలుకునది ధర్మయుతముగ సభలన్
సభలో మనసుకు ప్రియంగా ఉండే హిత వాక్యాలే చెప్పాలి. చాలా మితంగా మాత్రమే మాట్లాడాలి. అదీ సరళంగా, ఎదుటివారు నొచ్చుకొనని రీతిగా మాట్లాడాలి.
సత్యవాక్యం విలువ
[మార్చు]- నుతజల పూరితంబులగు నూతులు నూఱిటికంటె సూనృత
- వ్రత! యొక బావి మేలు, మఱి బావులు నూఱిటికంటెనొక్క స
- త్క్రతు వది మేలు, తత్క్రతు శతంబునకంటె సుతుండు మేలు, త
- త్సుతు శతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలు చూడగన్
నూరు నూతులకంటె ఒక బావి (దిగుడు మెట్లున్నది) మంచిది. నూరు బావులకంటె ఒక యజ్ఞము మంచిది. అటువంటి నూరు క్రతువులకంటె ఒక కుమారుడు మేలు. నూరుగురు కొడుకులకంటె ఒక సత్యవాక్యము మేలు
శారద రాత్రుల వర్ణన
[మార్చు]ఇది నన్నయ వ్రాసిన చివరి పద్యం - శరత్కాలపు రాత్రుల అందమయిన వర్ణన
- శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్
- జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో
- దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
- ర్పూర పరాగ పాండు రుచిపూరము లంబరి పూరితంబులై
మెరిసే తారకహారాలపట్ల శారదరాత్రులు దొంగలుగామారాయి (తెల్లని వెన్నెలలో చుక్కలు బాగా కనపడవు). అప్పుడే వికసించిన తెల్లకలువల సౌరభాలను వంటబట్టించుకొన్న పిల్లగాలులు వీస్తున్నాయి. పూల పరాగంతో ఆకాశం వెలిగిపోతున్నది. చంద్రుడు కర్పూరపు పొడివలె తెల్లని వెన్నెలను వెదజల్లుతున్నాడు.
(తరువాత ఎర్రన పద్యం కూడా ఇదే వర్ణనను కొనసాగించింది)